ఈ కావ్యం వెనక సంవత్సరాల పరిశోధన వుంది. మేధామథనముంది. మనిషి కథనముంది. అనిర్వచనీయమైన ప్రకృతి ఆరాధన దాగుంది. విద్యాసాగర్ గొప్ప భావకుడు. ఇతడిది వసుధైక దృష్టి. మనిషికీ, మట్టికీ ఉన్న ప్రకృతి బంధాన్ని అనితర సాధ్యంగా కవిత్వీకరించాడు.
సాగర్ కవిత్వం అత్యంత ఆధునికమూ అంతే జానపదమూ, ఈయన వస్తు రూపాలు ఎంత ప్రాచీనమో అంతే నవీనమూ. సాగర్ వైయక్తిక కవి కాదు. సామూహిక కవి.
సాగర్ ఆధునిక తెలుగు కవిత్వంలోకి కాలు మోపడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇతడి అక్షరాల వెనక బలమైన దళిత స్పృహ ఉంది. బహుజన దృక్పథమూ ఉంది. విశ్వశ్రేయ కావ్యాశయమూ ఉంది. ఇవాళ భారతీయ దళిత, బహుజన సాహిత్యం అంతగా పట్టించుకోని ప్రధానమైన పర్యావరణ కోణాన్ని సాగర్ మెలకువగా పట్టుకున్నాడు.
- ఎండ్లూరి సుధాకర్