నాకు జన్మనిచ్చింది ఎమ్‌.ఎన్‌.రావుగారు. వారి తండ్రిగారి పేరు ఎమ్‌.శేషాచలంగారు. వారి పేరున ఎం.శేషాచలం అండ్‌ కంపెనీగా నాకు నామకరణం చేశారు. దానిని కుదించుకుని ఎమెస్కోగా మారాను నేను. ఎమెస్కోగానే నేను అందరికీ తెలుసు. తెలుగునాట ప్రతీ ఇల్లు నాకు మెట్టినిల్లే. ఎంతో ప్రేమగా, అభిమానంగా ఇంతకాలంనుంచి ఆదరిస్తున్నారు నన్ను. నేను ఇప్పటివరకు నాలుగువేలకు పైగా పుస్తకాలద్వారా మీ చేతుల్లోకి వచ్చాను.
          ఈ 80 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో నిమ్నోన్నతాలని చూశాను. ఎమెస్కో పాకెట్‌ బుక్స్‌ ద్వారా వేలాది నవలలని, సాహిత్య గ్రంథాలను మీకు అందించాను. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నాలు శీర్షికన ప్రాచీన, ఆధునిక సాహిత్య గ్రంథాలను అతి తక్కువ ధరకు మీకు అందించడం జరిగింది. మీకు నేను దగ్గర కావడానికి ఎమెస్కో పాకెట్‌ బుక్స్‌ ఎంతగానో ఉపయోగపడింది. గురజాడ వారి కన్యాశుల్కం నుంచి అల్లసాని వారి మనుచరిత్ర వరకు ఎన్నో గ్రంథాలు ఎమెస్కో పాకెట్‌ బుక్స్‌ ద్వారా మీకు అందుబాటులోకి తెచ్చాను.
          ఎమెస్కో బుక్‌ క్లబ్‌ ద్వారా సుప్రసిద్ధ నవలా రచయతల, రచయిత్రుల నవలలను మీకు అందించాను. యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, యండమూరి వీరేంద్రనాద్‌, మల్లాది వెంకటకృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు, యర్రంశెట్టి సాయి వంటి రచయితల, రచయిత్రుల నవలలు ప్రతి నెలా మీకు అందుబాటులోకి తెచ్చాను. ఇంటింటా గ్రంథాలయం పథకం ద్వారా ఎమెస్కో ప్రచురణలే కాక రాష్ట్రంలోని వివిధ ప్రచురణకర్తల పుస్తకాలను మీకు అందుబాటులోకి తెచ్చాను. దేశంలో లక్షలాది గృహ గ్రంథాలయాలు ఏర్పడటం నన్ను మీకు మరింత దగ్గర చేసిన పరిణామం
          లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు, రచయిత్రులలో అత్యధిక శాతం వారి పుస్తకాలు ఎమెస్కో సంస్థ ద్వారా ప్రచురితమయ్యాయంటే అందుకు కారణం మీరు చూపిన ఆదరాభిమానాలే. 2000 సంవత్సరంలో వేదాల ప్రచురణ ఎమెస్కో చరిత్రలో, తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం! ప్రీ పబ్లికేషన్‌ ఆఫర్‌లో 2000కు పైగా సంపుటాలు అమ్ముడుపోవడం, తెలుగు భాషలో వేదాల ప్రచురణకు కావలసిన ఆర్థిక వనరుల మొత్తాన్ని పాఠకులే సమకూర్చడం, ఎమెస్కో ప్రచురించిన వేదాలు తెలుగునాట 200కు పైగా కేంద్రాలలో ఒకేనాడు ఆవిష్కృతం కావడం ఓ అద్భుతం కాక మరేమిటి? అందుకు నేను మీకు సదా కృతజ్ఞతతో ఉంటాను.
          అక్షరం వున్నంతకాలం మీతో నేస్తం చేయాలని నా తపన. అందుకే నిరంతరం కొత్త ఆలోచనలతో కొత్త రూపం సంతరించుకుంటుంటాను.ఆధునిక తెలుగు భాషకు ఓ మహా నిఘంటువు నిర్మించాలని నా సంకల్పం. 2,00,000కు పైగా ఆరోపాలతో వెలువడనున్న ఈ మహానిఘంటువు నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఊపందుకుంది.పొరుగు నుంచి తెలుగులోకి శీర్షికన ఆధునిక భారతీయ ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధమైన గ్రంథాలను తెలుగులోకి తెస్తున్నాం. ఇప్పటికే 31 గ్రంథాలు ఈ శీర్షికన వెలువడ్డాయి.సంస్కృత సాహిత్యంలో ఉత్కృష్టమైన రచనలను తెలుగులో తాత్పర్యాలతో ప్రచురించాలని సంకల్పం. ఆ పని చురుగ్గా సాగుతోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో బాలసాహిత్యం భారతీయ భాషలలో ప్రచురించాలని సంకల్పించాను. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, మరాఠి భాషలలో పిల్లల పుస్తకాల రచనా కార్యక్రమం ఊపందుకుంది. వాటికోసం అందమైన బొమ్మలూ సిద్ధమయ్యాయి. ఇప్పటికే 22 భారతీయ భాషల్లో 1200 కు పైగా  పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
          తెలుగునాట సుప్రసిద్ధమై అందుబాటులో లేని విలువైన గ్రంథాలను ప్రచురించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మొదటి విడతగా కథలు గాథలు, సాక్షి, కథా సరిత్సాగరం, ప్రపంచచరిత్ర మీచేతుల్లోకి వచ్చాయి.పుస్తక ప్రచురణ ఒక సమ్యక్‌ కర్మ. అందుకు నేను సూత్రధారిని మాత్రమే. ప్రచురణ యజ్ఞంలో పాఠకుల అభిమానమే ఆజ్యం. మీరు ఎంతగా ఆదరిస్తే, అభిమానిస్తే అంత గొప్ప పుస్తకాలు మీ ముందుకు వస్తాయి.

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015