ఇంత మహాశక్తి అతనికి ఉన్నా, అతనిలో ఒక పెద్ద లోటు ఉన్నది. నిశాపతిరావు పౌరుషంలో మార్దవం లేదు. అతనికి స్త్రీలు భోగవస్తువులు మాత్రం అనుకుంటాడు. 'ఎలాంటి కౌశల్యము గలిగిన స్త్రీ అరునా, ఎలాంటి విజ్ఞానవతి అరునా, ఎంతటి విద్యావంతురాలైనా అలాంటి స్త్రీ మరింత ఉత్తమమైన భోగవస్తువుగా మాత్రమే అవుతుంది' అని అతని వాదం. ఇట్టి తుచ్ఛపశుత్వభావం కలిగి ఉండడంచేతనే పురుషుడరున నిశాపతికిన్నీ, గానమూర్తియైన నిశాపతికిన్నీ సగమెరుక. స్త్రీని ముట్టుకుని గొంతుక యెత్తలేడు. గొంతుక సారించి స్త్రీని ముట్టుకోలేడు. స్త్రీ స్పర్శమాత్రాన అతను పశువైపోతాడు. ఒళ్ళు వణికిపోతుంది. మధుపానమత్తునిలా కళ్ళు కెంపులెక్కి తూలిపోతాడు. కొంకర్లుపోయే అతని వేళ్ళు వనితావక్షాలపైకి, ఊరువులపైకి వాలబోతారు.