భగవద్గీత కుల వ్యవస్థను ప్రేరేపించిందని, హింసను ప్రేరేపించిందని, అణచివేతకు భగవద్గీతను సవర్ణ హిందువులు ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఈ మధ్య విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. దానికి సమాధానం చెప్పే బాధ్యతను శ్రీ అరవిందరావు ఈ రచన ద్వారా స్వీకరించారు.
భారతీయులుకాని, భారతీయతపట్ల గౌరవం లేని పాశ్చాత్య పండితులు భారతీయ సాహిత్యానికి ఆంగ్ల భాషలో వక్రీకరించబడిన వ్యాఖ్యానాలు రాయడం, మూలనిష్ఠమైన చక్కని ఆధార గ్రంథాలు ఆంగ్లంలోనూ, ప్రాంతీయ భాషల్లోను లేకపోవడం వల్ల ఆ కువ్యాఖ్యానాలనే ప్రామాణికంగా భావిస్తూ భారతీయ సమాజంలో అలజడి బయలుదేరడం మనం గమనిస్తున్నాం. భగవద్గీత ఏం చెబుతోందో స్పష్టంగా మనం తెలుసుకుంటే ఆ తరువాత మన విజ్ఞతతో ఆ గ్రంథాన్ని గురించిన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. దానికోసమే ఈ ప్రయత్నం.