తెనుగు సాహిత్యంలో భాస్కరశతకం, సుమతిశతకం వంటి కొన్ని దృష్టాంత శతకాలు సుస్థిరంగా పండిత పామరలోకంలో నిలచియున్నట్లే ఈ ”మనోబోధ” శతకం తెలుగు పాఠక లోకంలో నిలచిపోగలదనుటలో సందేహం లేదు.
కవి లోకప్రయోజనాన్ని ఆశించి కావ్య నిర్మాణం చేస్తాడు. అందుకే వదాన్యులు కవికి సమర్పించుకొన్నదే ”సత్పాత్రదానం”గా పరిగణించి అనాదిగా సాహిత్యపోషణ గావించడం మనదేశ చరిత్రలో పరిపాటి. కావ్యనిర్మాణ దక్షుడైన కవికి ‘చరిత్ర’ ఏర్పడినట్లే సత్కవి పోషకులు చరిత్ర కెక్కగలరు. నన్నయ్యతో పాటు రాజరాజ నరేంద్రుని, పెద్దనతోపాటు శ్రీకృష్ణదేవరాయలను, చేమకూర వేంకటకవితో పాటు రఘునాథనాయకులను నిరంతరం తెలుగు పాఠకలోకం స్మరిస్తూనే ఉంటుంది.