'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.
ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, రమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు... కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ 'కోతికొమ్మచ్చి' 'బుడుగు'లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో 'ముత్యాలముగ్గు' సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.