తల్లిదండ్రులు శ్రీ పాలడుగు లక్ష్మయ్య, శ్రీమతి నాగరత్నమ్మ, భార్య శ్రీమతి సుశీలాదేవి.
ఆలోచన, అభ్యుదయం, ఆదర్శం, ఆచరణ, అంకిత భావం మెండుగా గల అరుదైన రాజకీయవేత్త ఈ రచయిత. గొప్ప చదువరి. విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన, ప్రపంచ రాజకీయ పోకడలను ఆకళింపు చేసుకున్న మేధావి.
విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తిత్వ సంపన్నుడు. విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడిగా, విద్యార్థి నాయకుడిగా పదిహేనేళ్ళపాటు సమాజం కోసం పనిచేసిన అనుభవం పాలడుగును శాసనసభలోను, శాసనమండలిలోను అడుగు పెట్టించింది.
పదేళ్ళు విధానసభలో, మరో పన్నెండేళ్ళు విధానపరిషత్‍లో తనదైనశైలిలో పనితీరు కనబరిచారు. పరిషత్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వేలాది పేద ప్రజానీకానికి నిజమైన స్వాతంత్య్ర ఫలాలు అందించిన సమసమాజవాది. అలాగే, వేలాది ఎకరాల భూమిని బీదలకు పంపిణీ చేయించిన ఉదారవాది. అణువణువున కాంగ్రెస్ సిద్ధాంతాలకు, రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడు. గెలుపోటములు రెండింటినీ సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడు.