వీరి జన్మస్థలం వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం. శ్రీమతి పల్లానర్సమ్మ, పల్లా పాపయ్య శాస్త్రిగారు వీరి జననీ జనకులు. సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర భాషవేత్త. ఉర్దూ భాషలో చక్కని అభినివేశం ఉంది. జ్యోతిశ్శాస్త్ర విశారదులు. సంప్రదాయ సిద్ధమైన పాండిత్యం, చక్కని ప్రతిభా వ్యుత్పత్తులు వీరి కవితా రచనా వ్యాసంగానికి దోహదం చేశాయి. భావ గాంభీర్యం, అనర్గళ ధార, నర్మహాస్యం, తెలుగు నుడికారం, తెలంగాణ మాండలిక పద ప్రయోగాలు వీరి కవిత్వ మంతటా కనిపిస్తుంటాయి.
'ప్రబంధ వాఙ్మయ వికాసము' వీరి సిద్ధాంత గ్రంథం. పాలవెల్లి (ఖండకావ్యం), గంగిరెద్దు (కావ్యం), చతురవచోనిధి (విమర్శ), అల్లసాని పెద్దన్న (విమర్శ), పెద్దన - కవితా వైభవం (పద్యాలపై వ్యాఖ్యానం), పారిజాతాపహరణం (గేయ ప్రబంధం) వీరి ఇతర రచనలు. 1945లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (చాదర్‌ఘాట్ కళాశాల)లో అధ్యాపకులుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, 1976 ఏప్రిల్ నెలలో ఆచార్యులుగా, నిజాం కళాశాల నుండి ఉద్యోగ విరమణ చేశారు.
DOB | 25-05-1914 |
DOD | 19-12-1983 |