అసలు పేరు కొడిదెల హనుమంతరెడ్డి. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. కర్నూలు జిల్లా, గడివేముల మండలం, గని అనే గ్రామంలో 1951, అక్టోబర్ 10న కొడిదెల సుబ్బమ్మ, సంజీవరెడ్డి దంపతులకు జన్మించాడు. తలముడిపి గ్రామంలో హైస్కూలు విద్య పూర్తిగావించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణంలో ఎం.ఎ. చదివాడు. ఇతడు నక్సలైటు ఉద్యమం వైపు ఆకర్షితుడై పన్నెండేళ్లు ఆ ఉద్యమజీవితం గడిపాడు. రెండు సంవత్సరాలు కారాగారవాసం చేశాడు. విమోచన పత్రికకు సంపాదకత్వం నెరిపాడు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. తర్వాత పదహారేళ్లపాటు వర్కింగ్ జర్నలిస్టుగా ఉదయం, ఈనాడు తదితర పత్రికలలో పనిచేశాడు. పత్రికలలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య వ్యాసాలను పావని, దినకర్, కె.సంజీవ్ అనే పేర్లతో వ్రాశాడు చాలా పత్రికలలో కథలు కవితలు ప్రకటించాడు. (వికిపీడియా నుండి)