ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావు కు అప్పగించాడు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతన్‍కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పది వేల రూపాయల విరాళం ప్రకటించాడు. 1910 లోబందరులో జాతీయ కళాశాలకు ఆయన ప్రారంభోత్సవం జరిపాడు.