1891 జన్మించి,1963లో మరణించాడు.
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది. ఆరోజులలో చరిత్ర చతురాననుడుగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు. అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాధమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు నేలటూరి వెంకట రమణయ్యతో కలిసీ నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని శాసనాల శర్మ అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.