తెలుగునాట సాహిత్యరంగంలో డా|| వై. రామకృష్ణారావు పేరు నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్నదే.
ఆధునికత, సంప్రదాయజ్ఞతల విశిష్ట సమ్మేళనం వైరా ప్రత్యేకత. పద్యం అల్లినా వచన కవిత కూర్చినా, గేయం ఆలపించినా గుండె లోతుల్లోని ఆర్తి భ్రమరనాదమే అతని ప్రవృత్తి. నలిగిన మరువం, దవనం మరింత పరిమళించినట్టుగా కడలి గుండె (వచన కవిత 1984), రాగధుని (గేయ సంపుటి 1988), అశ్రుగీతి (పద్య సంపుటి 2002), జీవేశ్వర శతకం (2009) వంటి రచనలు ఆయన సృజనశక్తికి నిదర్శనాలుగా భాసిస్తాయి. విరాటభారతి (సంస్కృత విరాటపర్వ సూక్తులకు వ్యాఖ్యానం 1994) అతని పాండిత్యానికి నికషోపలమైతే తులసీ సూక్తం (1995) అనువాద పాటవానికి తార్కాణం.
‘ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్య స్రవంతి’ (1987) ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో మనో విశ్లేషణ ధోరణులు’ పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం ప్రామాణికతకు పరిగణనలు.
మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్‌లోని చైతన్య కళాశాలలో అధ్యాపకత్వం నెరపిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు, అక్కిరాజు రామయ్య స్మారక అవార్డు, జ్యోత్స్నా కళా పీఠం అవార్డు వంటి గౌరవాలెన్నో లభించాయి. ఇక ఇప్పుడు ఈనాటి వినూత్న కవితారూపం నానీల ప్రక్రియను పండిస్తూ, తన ప్రయోగశీలాన్ని చాటుకుంటూ మీ ముందుకు …