ఈ పద్యకావ్యంలో వివిధ ఛందస్సులలో పద్యాలున్నప్పటికీ ఏవీ కొరకరాని కొయ్యలు కావు. పాఠకుల సౌలభ్యం కోసమే ఛందో లక్షణాన్ని పాటిస్తూనే, విసంధిగా రాసే పద్ధతిని కవి అవలంబించాడు. అట్లాగే వైరి సమాసాలను కూడా యథేచ్ఛగా ప్రయోగించాడు. గణయతి ప్రాసలను పట్టుదలగా పాటించినప్పటికీ పద్య ధారాళతకు ఇబ్బంది కలుగుతుందన్న పట్టులలో యతి నియమాన్ని కొంచెం సడలించాడు. అందువల్ల అతని పద్యాలు గేయ సదృశంగా నడిచాయి. మౌలిక కథనే సూటిగా చెప్పడం రచనకు వేగాన్నిచ్చింది.