ఇతడు ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, ఇలపావులూరు గ్రామంలో 1930, మార్చి 15వ తేదీన సరస్వతి, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. బి.ఇడి చదివాడు. ఇలపావులూరు గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా కొన్ని రోజులు పనిచేశాడు. హిందీ భాషా సాహిత్యాంశాలలో డాక్టరేటు సాధించి రాజమండ్రిలో హిందీ లెక్చరరు గా పనిచేశాడు. భారత భాషా పరిషత్, యు.పి.ఎస్.సి,భారతీయ జ్ఞానపీఠ్‌కు డైరెక్టరుగా పనిచేశాడు. ఇతనికి సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడు హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు.సంస్కృతం నుండి ఈశ్, కేన, మాండూక్య,ఐతరేయ, కఠోపనిషత్తులను తెలుగులోనికి గేయాలుగా తర్జుమా చేశాడు. త్యాగరాజకీర్తనలను హిందీలో గేయరూపంలో అనువదించాడు. బలివాడ కాంతారావు నవల ఇదే స్వర్గం, ఇదే నరకం రంగనాయకమ్మ నవల పేకమేడలు మొదలైనవాటిని హిందీలోనికి అనువాదం చేశాడు. ఇతడు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతూ తన 81 యేట 2011, డిసెంబర్ 25న మరణించాడు.