1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరకముందు సుమారు 11 ఏళ్లపాటు ఆయన ‘సామాజిక న్యాయం’ సాధించడానికి శ్రమించారు. 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ లో రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు. భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమంలో నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ అతి విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.